టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, టీడీపీ అభ్యర్ధి ఉమామహేశ్వరనాయుడు. సోమవారం పార్టీ కార్యకర్తలు, నేతలతో ఎన్నికల సరళి, పోలింగ్‌పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం ఉమా మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకరు టీడీపీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారననారు. 30 ఏళ్ల పాటు సుధీర్ఘంగా పనిచేసి, ఎన్నో పదవులు అనుభవించారని చివరికి పార్టీకే ద్రోహం చేశారంటూ ఉమా మండిపడ్డారు.

తనకు వ్యతిరేకంగా పనిచేసినట్లు తన వద్ద ఫోన్ కాల్స్ రికార్డిండ్, వీడియో క్లిప్పింగుల ఆధారాలున్నాయన్నారు. చివరికి కార్యకర్తలను బెదిరించే స్థాయికి దిగజారంటే నిజంగా సిగ్గు లేదంటూ మండిపడ్డారు.

పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తారా అంటూ ఉమా ప్రశ్నించారు. టీడీపీని ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు, కుట్రలు, లోపాయికారీ ఒప్పందాలు జరిగినా కళ్యాణదుర్గంలో పసుపు జెండా ఎగరడం ఖాయమని ఉమానాయుడు ధీమా వ్యక్తం చేశారు.

పోలింగ్ సరళిపై అందించే జాబితాలో నిష్పక్షపాతంగా పార్టీకి ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయలేదో వారి వివరాలు తెలియజేయాలని ఉమా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ నివేదికను అధినేత దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.