ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తూర్పు గోదావరిలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. టిక్కెట్టు సాధించడమే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. ఏ పార్టీ అయినా పర్లేదు... టిక్కెట్ కన్ఫమ్ అయితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో అన్ని రకాలుగా బలంగా ఉండి, టిక్కెట్లు దక్కని నేతలను జగన్ తమ వైపుకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమలో బలమైన నేతగా ఉన్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు.

అనారోగ్య కారణాలతో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, పోటీ నుంచి విరమించుకుంటానని తోట నర్సింహం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. తనకు బదులుగా భార్య వాణికి జగ్గంపేట టికెట్ ఇవ్వాలని కోరారు.

అయితే జగ్గంపేటలో బలమైన నేత జ్యోతుల నెహ్రూ వుండటంతో టిక్కెట్ ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో నర్సింహం కుటుంబం టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో తోట ఫ్యామిలీ వైసీపీలో చేరితే పెద్దాపురం టిక్కెట్ ఇస్తానని జగన్ రాయబారం పంపినట్లుగా తెలుస్తోంది. పెద్దాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న దవులూరి దొరబాబుకి కాకినాడ ఎంపీ టిక్కెట్ ఇస్తామని పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

టీడీపీ సీనియర్ నేత, హోంమంత్రి చినరాజప్పకు తోట వాణి బలమైన పోటీ ఇస్తారన్న కోణంలోనే ఆమెకు ఆ సీటు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో వైసీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న తోట సుబ్బారావు నాయుడు... చినరాజప్పకు సరైన పోటీ ఇవ్వలేదని భావించిన జగన్... సుబ్బారావును తొలగించి దవులూరి దొరబాబును తెరపైకి తెచ్చారు.

ఈ సమయంలో భారీగా ఖర్చు పెట్టిన దొరబాబును కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించి తోట వాణికి ఆఫర్ ఇవ్వడంతో పెద్దాపురంలో వైసీపీ క్యాడర్ అయోమయంలో పడ్డారు. మరోవైపు తోట నర్సింహం, ఆయన భార్య వాణి టీడీపీలోనే కొనసాగాలని వాణి సోదరుడు, అమలాపురం తెదేపా నేత మెట్ల రమణబాబు సోమవారం రాత్రి వీరిద్దరిని కలిశారు. అయితే కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం ప్రకారం తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా సమాచారం.