తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ ఎంపీ తోట నర్సింహం బుధవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విషయంలో తెలుగుదేశం పార్టీ ఘోరాతిఘోరంగా అన్యాయం చేసిందని నర్సింహం ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కోసం శ్రమించే తమ కుటుంబాన్ని టీడీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశానని నర్సింహం గుర్తుచేశారు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రం రెండు ముక్కలైందని ప్రజలకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తోట నర్సింహం గుర్తు చేశారు.

అనారోగ్య కారణాలతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, తనకు బదులుగా తన భార్యకు జగ్గంపూడి టికెట్ ఇవ్వాలని కోరితే చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జక్కంపూడి రామ్మోహన్‌రావు అనారోగ్యంతో ఉన్నప్పుడు పనిభారం ఎక్కువౌతుందనే ఉద్దేశ్యంతో ఆనాడు వైఎస్ ఎక్సైజ్ శాఖను కేటాయించారన్నారు. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పట్టించుకునేవాడిని కాదని కానీ ఎక్కడా గౌరవం ఇవ్వకపోవడం తీవ్రంగా బాధించిందని నర్సింహం తెలిపారు.