విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ పప్పులో కాలేశారు. శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేఏ పాల్ తాను రేపే నామినేషన్ వేస్తానని చెప్పుకొచ్చారు. 

ఆదివారం కదా అని ప్రశ్నిస్తే నాలుక కరచుకున్న కేఏ పాల్ రేపు కాకపోతే ఎల్లుండి వేస్తా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు రేపు ప్రిపేర్ అయితా సోమవారం నామినేషన్ వేస్తానంటూ కవర్ చేసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. 

ఇకపోతే తాను ఇప్పటి వరకు పాలకొల్లులో పోటీ చేస్తానని అనుకున్నానని కానీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు.  పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా భీమవరం లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

నా సత్తా ఏంటో పవన్ కళ్యాణ్ కు చూపిస్తానంటూ  కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల ప్రకటనపై ప్రశ్నించగా త్వరలో విడుదల చేస్తానని ముందు తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నానో రాసుకోండంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్.