విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. చంద్రబాబు తనకు వెన్నుపోటు పోడిచారని ధ్వజమెత్తారు కేఏ పాల్  పిల్లనిచ్చిన సొంతమామ, మాజీ సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు తనకు పొడవడం ఓ లెక్కా అంటూ విమర్శించారు. 

చంద్రబాబు అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆయనలా మరెవరు అబద్దాలు చెప్పలేరంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు నీతి నిజాయతీ లేదని విమర్శించారు. నామా నాగేశ్వరరావు లాంటి వారు టీడీపీని ఎందుకు విడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటేనని హెచ్చరించారు. చంద్రబాబుకు నినాదాలివ్వడమే చేతకాదని ఎద్దేవా చేశారు.  మీ భవిష్యత్తు మా బాధ్యత అనే నినాదాన్ని చంద్రబాబు ఇస్తున్నారని, ఈ నినాదం వెనుక ఉన్న అర్థం ఏంటో చెప్పాలని నిలదీశారు. 

నిరుద్యోలు ఉద్యోగాలు రాకుండా చావాలనా, రైతులు ఆత్మహత్య చేసుకోవాలనా, కంపెనీలు అన్నీ దివాళ తీయాలనా ఏ ఉద్దేశంతో మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారో చెప్పాలని ప్రశ్నించార కేఏ పాల్. 

అంతేకాదు నిత్యం తెలుగుదలో మాట్లాడే కేఏ పాల్ హిందీలో మాట్లాడుతూ నానా హంగామా చేశారు. ఝూట్ నయ్ బోల్తా.. కబీ బీ నయ్ బోలా.. కబీ ఝూట్ నయ్ బోలేంగే అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. బడా బడా బాత్ కర్తా.. కుచ్ కామ్ నయ్ కర్తా.. కమ్ సే కమ్ షురూ కరో అంటూ ఎన్నికల్లో పోటీపై వ్యాఖ్యానించారు. 

ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి రూ.5లక్షలు మాత్రమే కర్చుపెట్టమని చెప్తున్నానని అంతకంటే ఎక్కువ కర్చు పెట్టొద్దని చెప్తున్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్, పవన్‌ ముగ్గురుకి ఓటెయ్యొద్దని చెప్పుకొచ్చారు. 

వాళ్లు తిరిగే హెలికాఫ్టర్‌కు వెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేయాలని కోరుతూ విజయసాయి రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. తమకు ఓటర్లే జెండాలని తమకు ఎలాంటి జెండాలు లేవన్నారు కేఏ పాల్.