అమరావతి: ప్రజాశాంతి పార్టీ ఏ, బీ ఫారాలను దొంగిలించి తెలుగుదేశం పార్టీ నేతలు వేరొకరితో నామినేషన్లు వేయించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

టీడీపీ నేతలు అభ్యర్థులను నిలబెడితే తానుపెట్టినట్లు వైసీపీ అపార్థం చేసుకుంటుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. 

చంద్రబాబు నాయుడుకు తాను మద్దతు ఇవ్వడం లేదని, ఒకవేళ మద్దతు ఇవ్వాల్సి వస్తే చంద్రబాబునాయుడుకు ఓటు వేయోద్దంటూ ప్రచారం చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని అందుకే చంద్రబాబుకు ఓటేయ్యెద్దంటూ హితవు పలికారు. 

మరోవైపు వైఎస్ జగన్ కు ఓటేస్తే రాష్ట్రం రావణాకాష్టం అవుతుందన్నారు. జనసేన పార్టీకి ఓటేయోద్దన్నారు. పగిలిపోయే గ్లాస్ కు ఓటేస్తే ఎవరికి లాభం ఉండదన్నారు. అమరావతి సచివాలయంలో సీఈవో గోపాల కృష్ణ ద్వివేదిని కేఏ పాల్ కలిశారు. 

ప్రజాశాంతి పార్టీ బీ ఫామ్‌లను టీడీపీ, వైసీపీ దొంగలించాయని ఫిర్యాదు చేశారు. మార్చి25 తెల్లవారు జామున 2గంటలకు హోటల్ ఐలాపురంలో ఉన్న తమ రూమ్ లోకి టీడీపీ, వైసీపీ వాళ్లు వచ్చి దాడి చేసి వాటిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. 

తమ పార్టీ బీఫామ్ లతో అభ్యర్థులు పోటీలో ఉన్నారని వారికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అందువల్ల ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మోదీతో చేతులు కలిపి ఆహా ఓహో అన్నారని ఇప్పుడు విమర్శిస్తున్నారని మళ్లీ తర్వాత కలిసిపోయినా ఆశ్యర్యపోనక్కర్లేదన్నారు. 

తనకు భద్రత కల్పించాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు తనకు భద్రత కల్పించడం లేదన్నారు. తనకే భద్రత కల్పించలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. 

జగన్‌కు అధికారం ఇస్తే రాష్ట్రం రావణకాష్టమవుతుందని, పగిలిపోయే గ్లాస్ కి ఓటేస్తే ఎందుకు పనికిరాకుండా పోతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం తాను భీమవరం వెళ్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నర్సాపురం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటానని కేఏ పాల్ ప్రకటించారు.