హైదరాబాద్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు తటస్థులు జగన్ కు జై కొడుతూ వైసీపీ గూటికి చేరుతుంటే అటు సినీ ఇండస్ట్రీ కూడా జగన్ కు జై కొడుతున్నారు. 

ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ గా పేర్గాంచారు. ఇకపోతే ప్రముఖ నటి జయసుధ, అలనాటి హీరో భానుచందర్, కృష్ణుడు, కమెడియన్ పృథ్వీ, పోసాని కృష్ణమురళీతోపాటు పలువురు వైసీపీ గూటికి చేరారు. 

తాజాగా  కమెడీయన్ జోగినాయుడు సైతం వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జోగినాయుడుతోపాటు పలువురు సినీనటులు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

అలాగే తెలుగు సీరియల్ లో పలు పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తున్న నటులు జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్వినిలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా కమెడియన్ పృథ్విరాజ్, కృష్ణుడుల సమక్షంలో వైసీపీ కండువాకప్పుకున్నారు.  

ఈ సందర్భంగా కమెడియన్ పృథ్వీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిదొరక్క ఓట్లు కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే టీడీపీ అరాచకాలను వీధి నాటకాల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు పృథ్వీ.