డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ, పెన్షన్ స్కీమ్ టీడీపీని ఈ ఎన్నికల్లో బతికించనుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు
అమరావతి: డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ, పెన్షన్ స్కీమ్ టీడీపీని ఈ ఎన్నికల్లో బతికించనుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు మరోసారి సీఎంగా ప్రమాణం చేస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
సోమవారం నాడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. పసుపు-కుంకుమ, పెన్షన్ల స్కీమ్ లేకపోతే తమ పార్టీ పరిస్థితి భగవంతుడికే తెలియాలని ఆయన కుండబద్దలు కొట్టారు.
చంద్రబాబునాయుడు అదృష్టవంతుడని... పసుపు-కుంకుమ డబ్బులు, అన్నదాత సుఖీభవ నిధులు ఎన్నికల సమయంలోనే ప్రజల ఖాతాల్లో చేరాయన్నారు. ఒక్క నెల ముందుగానీ, నెల రోజులు ఆలస్యంగా ఈ నిధులు ఖాతాల్లో చేరితే ప్రజలు మర్చిపోయేవారన్నారు. అదే జరిగితే తమ గతి అధోగతి అయ్యేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడు 120 సంక్షేమ పథకాలను, నదుల అనుసంధానం చేసినా ఎవరూ కూడ ఆయనను అభినందించలేదన్నారు. తన నియోజకవర్గంలో అన్ని పార్టీలు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు.
రాయలసీమలో రూ. 5 వేలను డిమాండ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యర్థి రూ. 2 వేలు ఇస్తే.. అంతకంటే ఎక్కువ డబ్బులను డిమాండ్ చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల కింద బాబు సర్కార్ విడుదల చేసిన నిధులతో ఆయనే ముఖ్యమంత్రిగా అవుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను తాను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తాను ప్రచారం చేస్తానని చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణ, చలమేశ్వర్, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్లతో కలిసి ప్రచారం చేస్తానన్నారు.
తాను రాజకీయాల నుండి రిటైరయ్యాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రజల్లో చైతన్యం కోసం ప్రచారం చేస్తానని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల కోసం ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆయన తెలిపారు.
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అవినీతి తగ్గుతోందన్నారు. ప్రజల కోసం పనిచేసేవారికే మేలు జరుగుతోందన్నారు. వచ్చే నెల 3వ తేదీన హైద్రాబాద్‌లో ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.ఎన్నికల్లో సంస్కరణల గురించి తాను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 22, 2019, 11:35 AM IST