నెల్లూరులోని రాజకీయ నాయ‌కులు బెట్టింగ్ లో ఎక్స్ ప‌ర్ట్స్ లా త‌యార‌య్యారని పవన్ విమర్శించారు. అలాంటి వారికి రాజ‌కీయాలెందుకు క్లబ్బుల్లోనే కూర్చుని పేకాట, బెట్టింగులు ఆడుకోవాలని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ వ్యవహారాతో ఎక్కువగా సంబంధాలు కలిగి వున్నట్లు తెలుస్తోందని...ఈ వ్యసనాలను మాని ప్రజాసేవ చేయాలని పవన్ సూచించారు. 

ఓ ప్రజాప్రతినిధి అయివుండి పోలీసుల చొక్కాలు ప‌ట్టుకుని రౌడీయిజం చేస్తారా..?అంటూ  ప్రశ్నించారు. ఇలాంటి నాయకులు రేపు అధికారంలోకి వ‌స్తే ఊరుకుంటారా..? ఇంకెంత రెచ్చిపోతారో అని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ లేదని, వాళ్ల ఫ్యాన్ తిర‌గాలంటే మ‌న ద‌గ్గ‌ర నుండే ప‌వ‌ర్ వెళ్లాలని...స్విచ్ కూడా మ‌న ద‌గ్గ‌రే ఉందంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
 ప్రస్తుతం ఏపిలో రాజ‌కీయాలంటే వైఎస్ఆర్‌సిపి, టిడిపి నాయ‌కులకు బెట్టింగ్ మాదిరిగా అయిపోయాయ‌న్నారు. చివరకు జెండా ఏవైపు ఎగురుతుంది అనే వాటిపైనా  వీళ్లు బెట్టింగులు ఆడుతారని విమ‌ర్శించారు. రెండు పార్టీల నాయ‌కులు బెట్టింగుల కోసం క‌ల‌లు కంటుంటే జ‌న‌సేన నాయ‌కులు మాత్రం యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి క‌ల్పించాల‌ని, స్థానిక స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని తెలిపారు.  

2019లో నెల్లూరు సిటీ సీటు గెలిచి రాజ‌కీయాల్లో మార్పు సింహ‌పురి నుంచి మొద‌లు పెడ‌దామ‌ని పవన్ పిలుపు నిచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ తనకు పెద్ద అభిమానినని చెప్పుకుంటాడని...కానీ రెండుమూడు సార్లు అతడికి క‌లిసినపుడు తాను ఒకే మాట చెప్పానన్నారు. నిజంగా తన అభిమానివే అయితే ముందు బెట్టింగులు మానేయాలని చెప్పినట్లు పవన్ వెల్లడించారు.