ఉత్తరప్రదేశ్: పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మరో పార్టీతో పొత్తుకు సై అన్నారు. 

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలతోపాటు జాతీయ పార్టీ బీఏస్పీతో  కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వెళ్లిన పవన్‌ బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామనిస్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌. డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అందువల్లే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. 

అందుకు మయావతి మార్గ నిర్దేశకత్వం చాలా అవసరం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయం అందరికీ అందించాల్సిన అవసరం తమపై ఉందన్నారు. 

గత కొద్ది రోజులుగా రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో పార్టీతో పొత్తుకు సై అన్నారు. అలా మెుత్తం లెఫ్ట్ పార్టీలతోపాటు బీఎస్పీతో కూడా కలిసి పనిచెయ్యాలని పవన్ నిర్ణయించుకున్నారు.