ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఫలితాలు వెలువడటానికి ఇంకా నెలరోజుల సమయం ఉంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అని రాజకీయ నాయకులతోపాటు.. ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఒకవైపు టీడీపీ, వైసీపీ విజయం మాదే అని మీడియా ముందు రెచ్చిపోతుంటే... జనసేన నేతలు మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే పలు జనసేన కార్యాలయాలు మూతపడ్డాయనే ప్రచారం ఊపందుకుంది.

ఈ ఎన్నికల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడతామని.. గెలిచినా, ఓడినా ప్రజల వెంట ఉంటామని చెప్పిన జనసేన నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ ఆఫీసుల నిర్వహణకు కూడా నిధులు లేక విలవిలలాడుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేరుగా ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో.. గాజువాక రాజకీయాల రూపురేఖలు మారాయంటూ అందరూ చర్చించుకున్నారు.

అయితే.. ఇప్పుడు అదే గాజువాకలో.. పార్టీ కార్యాలయాన్ని సైతం మూసేసారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత జనసేన పార్టీ కనిపించకుండా పోతుందనే విమర్శలకు ఊతమిచ్చేలా పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. గాజువాకలో కనీసం  పార్టీ కార్యాలయాలు తెరుచుకోవడం గమనార్హం.

పవన్ నామినేషన్ వేసిన వారం రోజులకు గాజువాకలో తొలుత పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. నియోజకవర్గంలో 15 వార్టల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ  పోలింగ్ అనంతరం మొయిన్ బ్రాంచ్ తప్ప.. అన్నింటీనీ మూసేయడం గమనార్హం. అభిమానులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఆఫీసుల ముందు కూడా ఇప్పుడు టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వీటన్నింటినీ చూస్తే.. గాజువాకలో జనసేన గట్టెక్కడం కష్టమేననే వాదనలు వినపడుతున్నాయి.