పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి గతంలో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి పోలిక పెడుతూ ప్రతి రోజు చర్చ జరుగుతూనే ఉంది. నాటి ఎన్నికల్లో చిరంజీవి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి, 18 అసెంబ్లీ స్థానాలను గెలుపొందారు.

ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర మంత్రయిపోయారు. అది ఇప్పుడు గతం.. అయితే అన్నతో పవన్‌ను పోలుస్తూ జనం మాట్లాడుకుంటున్నారు.

తాజా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన పవన్ తన స్థానాన్ని మాత్రం ఖరారు చేయలేదు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

తొలుత అనంతపురం ఆతర్వాత ఏలూరు, ఇచ్చాపురం పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ పవన్ మనసులో ఏముందో బయటకు రాలేదు. అయితే పోటీ చేసే విషయంలో అన్నయ్య చిరంజీవినే ఫాలో అవుతున్నారు తమ్ముడు పవన్ కల్యాణ్.

2009 ఎన్నికల్లో చిరు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. అయితే పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో మాత్రమే గెలిచారు. ఇప్పుడు తాను కూడా అన్నయ్య దారిలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు.

ఇప్పటికే ఒక స్థానంపై స్పష్టత ఇచ్చేశారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో స్థానం ఏదనే దానిపై రెండు రోజుల్లో క్లారిటీ ఇచ్చేయాలని పవన్ భావిస్తున్నారు. మరి జనసేనాని అన్నయ్యలా రెండు స్థానాల్లో పోటీ చేస్తారా లేక ఒక స్థానంతో సరిపెట్టుకుంటారా అనేది త్వరలోనే తేలిపోనుంది.