తెలుగు దేశం ప్రభుత్వ హయాంతో మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాకు చేసిన సేవలు ఇక చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన నెల్లూరుకు చేసిందేమీ లేదని...కానీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇక్కడ తానేదో అభివృద్దిని పరుగులెత్తించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఆయన వల్ల ఏ పని కాదని...ఇకనుంచి తమ అధినేత తనయుడు, మంత్రి లోకేశ్ బాబుకు ట్యూషన్లు చెప్పుకుంటూ మంచిదని పవన్ సెటైర్లు వేశారు. 

చిన్న చిన్న ట్యూష‌న్లు చెప్పుకొనే స్థాయినుండి నారాయ‌ణ ఇన్ని విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు ఎలా పెట్టగలిగారని ప్రశ్నించారు. ఆయ‌న అవినీతిని వ‌దిలి పెట్టేది లేదని హెచ్చరించారు. ప్ర‌జా క్షేత్రంలో నిల‌బెట్టి ఎండ‌గ‌డ‌తామన్నారు. ఇక ఆయన ఆగడాలు నెల్లూరులో సాగవని.... మావాళ్లు వ‌చ్చారు.. ఇక్క‌డ స‌మ‌స్య‌లు వాళ్లు ప‌ట్టించుకుంటారని పవన్ తెలిపారు.    

ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న మంత్రి నారాయ‌ణ కావ‌చ్చేమో.. తనకు మాత్రం ఆయ‌నో మాములు నారాయ‌ణేనని అన్నారు. గతంలో  రొట్టెల పండుగ‌లో పాల్గొనడానికి నెల్లూరు వ‌స్తే న‌న్ను అడ్డుకోవాల‌ని విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ మా అమ్మ సొంత ఊరికి రాకుండా అడ్డుకోలేకపోయారన్నారు. ఇక్కడికి సమీపంలోని ఫతేఖాన్ పేట, మూలాపేట, టెక్కేమిట్టా ప్రతి దగ్గర నాకు కావాల్సిన మనుషులు, కుటుంబాలు చాలా వున్నాయని పవన్ తెలిపారు.