విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. 

ఆగనంపూడి శివాలయం వద్ద తన ఎన్నికల ప్రచారాన్ని మెుదలపెట్టిన జనసేనాని గాజువాక నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను తీర్చేందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగనంపూడిని రెవెన్యూ డివిజన్‌ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఎన్నో సమస్యలు ఉన్న గాజువాకను గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 

అందుకే తాను గాజువాక నుంచి పోటీ చేసి వాటిని పరిష్కరించాలన్నదే తన లక్ష్యమన్నారు. మరోవైపు గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గాజువాకలో నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రాతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తానని అలాగే నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేస్తానని పవన్‌ కళ్యాణ్ హామీ ఇచ్చారు.