ఏపి ప్రజల ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే రైతులకు రూ.5వేల ఫించను ఫైలుపైనే తొలి సంతకం పెడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అన్నంపెట్టే రైతన్నలకు ఆర్థిక భరోసా అందించడానికే ఈ పథకాన్ని రూపొందించామన్నారు. ఆ తర్వాతి సంతకం కూడా రైతన్నలకు సాగుసాయం కింద ఏడాదికి రూ.8వేలు అందించే ఫైలుపై పెడతానని తెలిపారు. ఇక మూడో సంతకం ప్రతి  కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ఇచ్చే ప‌థ‌కం ఫైలుపై పెడతానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

సోమ‌వారం జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా గుంటూరు న‌గ‌రంలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. గుంటూరు ప‌శ్చిమ, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా ఏడాదికి ఆరు నుంచి ప‌ది సిలిండ‌ర్లను అందిస్తామన్నారు. ఇందుకు కుటుంబ సభ్యుల ఆదాయంతో సంబంధం లేకుండా జ‌న‌సేన ప్ర‌భుత్వమే ఉచితంగా ఇస్తుందన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం అందిస్తున్న రేష‌న్‌కి బ‌దులు కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా ఆడ‌ప‌డుచుల ఖాతాల‌కు నెల‌కి రూ. 2500 నుంచి రూ. 3500 బ‌దిలీ చేసే ప‌థ‌కం ప్రవేశపెట్టనున్నట్లు  హామీ ఇచ్చారు. 

రాజ‌కీయం అంటే కేవలం లోకేష్ భ‌విష్య‌త్తో, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి భ‌విష్య‌త్తో కాదు మీ బిడ్డ‌ల భ‌విష్య‌త్తని అని తెలిపారు. అది ఇచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వ‌చ్చానని వెల్లడించారు. గుంటూరు పుర వీధుల్లో న‌డిచి రాజ‌కీయాల్లో మార్పు తీసుకువ‌స్తానని...అందుకు మీరు సహకరించాలన్నారు. ఒక్క కౌన్సిల‌ర్ కూడా లేకుండా ఇంత చేశానంటే...తనకు అధికారమిస్తే ఇంకెంత చేస్తానో మీరే అర్థం చేసుకోవాలని సూచించారు. విజయం దిశగా ఆడ‌ప‌డుచులు వీర  తిల‌కం దిద్ది పంపాలని పవన్ కోరారు.