వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో... జగన్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ నెల 30వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చివరి అంకానికి చేరుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా స్టేడియం లోపల, బయట ఏర్పాట్లు చేపట్టారు. అంచనాలను మించి వచ్చినా వీక్షించేందుకు నగరంలోని ముఖ్య కూడళ్లలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. 

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వీలైనంత నిరాడంబరంగానే నిర్వహించాలన్ని రాష్ట్ర అధికార యంత్రాంగానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ సూచించినట్టు సమాచారం. కార్యక్రమానికి అర లక్షమంది వరకు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, వారికి మంచినీరు, స్నాక్స్‌, మజ్జిగ వంటివి ఏర్పాటు చేయాలని కృష్ణా జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.