ఎన్నికలు సమీపిస్తున్నవేళ వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. టికెట్ తమకు తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఉన్నవారంతా.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో నీరుగారిపోతున్నారు. తాజాగా.. జగన్ ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చారు. 

మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డికి వైసీపీ అధినేత జగన్‌ షాక్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మైనారిటీ వర్గాలకే టికెట్‌ కేటాయిస్తానంటూ తేల్చి చెప్పేశారు.మదనపల్లె అసెంబ్లీ టికెట్‌ కోసం దేశాయ్‌ తిప్పారెడ్డి తొలి నుంచీ చాలా ధీమాగా వున్నారు. 

తిప్పారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా తమ్ముడు నవాజ్‌ కూడా రేసులో వున్నారు. గత ఎన్నికల్లో జిల్లా నుంచీ మైనారిటీలకు అవకాశం ఇవ్వని నేపధ్యంలో ఈ పర్యాయం మదనపల్లె లేదా పీలేరు స్థానాన్ని మైనారిటీకి కేటాయించాలని జగన్‌ భావించారు. 

అయితే పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని ఎదుర్కొనడానికి మైనారిటీ అభ్యర్థి సరిపోరన్న అభిప్రాయంతో అక్కడ చింతల రామచంద్రారెడ్డికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
 
పీలేరుకు బదులు మదనపల్లెలో మైనారిటీ అభ్యర్థికి ఇస్తే సరిపోతుందన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై గత నెల రోజులుగా అనుమానంతో వున్న తిప్పారెడ్డి పలుమార్లు అధినేతను కలిశారు. ఇటీవల వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. శుక్రవారం కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని జగన్‌ను కలిశారు. ఆ సందర్భంగా జగన్‌ మదనపల్లె సీటు మైనారిటీ అభ్యర్థి నవాజ్‌కు ఇస్తున్నట్టు చెప్పేశారు.

దీంతో.. తిప్పారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన తనను పక్కనపెట్టడంతో అతను ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.