ఢిల్లీ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో నామినేషన్ దాఖలు చేసిన 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పార్టీకి చెందిన వారు కాదని స్పష్టం చేశారు. 

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఆయన వైసీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోలే అభ్యర్థులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే నామినేషన్లు వేయించారని ఆరోపించారు. తమ పార్టీ బీఫామ్ లను ఫ్యాబ్రికేట్ చేసి చంద్రబాబు, వైఎస్ జగన్ లు వాడుకుంటున్నారని ఆరోపించారు. 

వైసీపీ ఆరోపించినట్లు ఆ 35 మంది అభ్యర్థులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో తమ పార్టీ ప్రతినిధులపై దాడి చేసి బీఫామ్ లు దొంగిలించారని పాల్ స్పష్టం చేశారు. 

ఏం చేసినా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పార్టీలు గెలిచే అవకాశం లేదన్నారు. మరోవైపు ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేంత వరకు ఎన్నికలు వాయిదా వెయ్యాలని కోరారు. ఎన్నికలు వాయిదా వెయ్యకపోతే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదా కోసం కోర్టుకు వెళ్తానని కేఏ పాల్ తెలిపారు.