అనంతపురం: తమిళనాడు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ఐటీ దాడులు మరవకముందే ఏపీలోనూ అదే తరహాలో మెురుపుదాడులు ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తాకు షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు.  

ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం గుత్తిలోని మధుసూదన్ గుప్తా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కుట్టు మిషన్లు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

ఐటీ దాడుల విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర ధర్నా నిర్వహించారు. అయితే ఐటీ సోదాల్లో కుట్టు మిషన్లతోపాటు కీలక పత్రాలు కూడా లభ్యమయ్యాయని వాటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని టాక్.  

మధుసూదన్ గుప్తా మెున్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులలో మధుసూదన్ గుప్తా ఒకరు. టీడీపీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన జనసేన పార్టీలో చేరడం పవన్ కళ్యాణ్ వెంటనే టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. 

ఇకపోతే ఇటీవలే కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించి ఆస్పత్రిలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులోనూ ఐటీ దాడులు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.