విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను మోసం చేశారని జనసేన పార్టీ నేత కొణతాల సీతారాం ఆరోపించారు. అనకాపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ కొణతాల  రెబల్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక కబ్జాకోరుకు టికెట్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. పరుచూరి భాస్కర్ విశాఖపట్నంలో అనేక భూములు కబ్జా చేశారని అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను మోసం చేశారని విమర్శించారు. 

పార్టీ కోసం రూ.7కోట్లు ఖర్చుపెట్టానని అలాంటిది తనను కాకుండా భూకబ్జాదారుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. కార్యకర్తల మనోభవాలు దెబ్బతింటే పార్టీ మనుగడ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి పార్టీ బలోపేతం కోసం శ్రమించానని తెలిపారు. 

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఢిల్లీ వరకు జనసేన జెండా తీసుకెళ్లిన ఏకైక వ్యక్తిని తానేనని చెప్పుకొచ్చారు. పరుచూరి భాస్కర్ కు టికెట్ ఇవ్వడంతో తాను అలిగానని కానీ రెబల్ గా పోటీ చెయ్యాలని భావించలేదన్నారు. 

తనకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వెళ్తే మూడు రోజులు పార్టీ కార్యాయలంలో ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కారు అడ్డగిస్తే కారుతో కొట్టి వెళ్లిపోయారని బౌన్సర్లు అయితే పిడిగుద్దులతో దాడి చేశారంటూ ఆరోపించారు. 

తాను దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తారని ఊహించలేదన్నారు. అనకాపల్లి జనసేన అభ్యర్థిగా పరుచూరి భాస్కరరావుకు ఇవ్వడంతో తాను స్తబ్ధుగా ఉన్నానని అయితే తాను రూ.7కోట్లుకు అమ్ముడుపోయానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

తాను ఏనాడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని, అలాంటి వ్యక్తిని కూడా కాదన్నారు. తనపై లేనిపోని నిందలు వెయ్యడంతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. రాజకీయ అనుభవజ్ఞులకు గానీ, పార్టీలు మారిన వారికి గానీ టికెట్లు ఇవ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తుంది ఏంటని నిలదీశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తానేంటో నిరూపిస్తానని సవాల్ చేశారు కొణతాల సీతారాం.