పోలింగ్‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున సైనికులా మాదిరిగా పోరాటం చేయాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. 

అమరావతి: పోలింగ్‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున సైనికులా మాదిరిగా పోరాటం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు.

సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల తర్వాత కార్యకర్తల కష్టానికి, త్యాగానికి గుర్తింపు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టో‌తోనే ఆ పార్టీ మోడీ, కేసీఆర్‌‌‌లతో కుమ్మక్కైన విషయం బయట పడిందని ఆయన విమర్శించారు.

నాగార్జునసాగర్, శ్రీశైలంపై పెత్తనాన్ని జగన్‌ కేసీఆర్‌కు అమ్మేశారని ఆయన ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాలను టీఆర్ఎస్‌కు జగన్ తాకట్టుపెట్టారన్నారు. అన్ని సర్వేలు కూడ టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయాన్ని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.