అమరావతి:లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఇవాళ రాత్రి వరకు నిర్ణయం తీసుకొంటామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.

మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

నంద్యాల అసెంబ్లీ, నంద్యాల పార్లమెంట్ స్థానాలకు అత్యధికంగా నామినేషన్లు దాఖలైనట్టు ఆయన తెలిపారు.   పార్వతీపురం, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు పది చొప్పున నామినేషన్లు దాఖలైనట్టు ఆయన తెలిపారు.  రాష్ట్రంలోని 118 అసెంబ్లీ స్థానాల్లో 50 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైనట్టు ఆయన వివరించారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు 548 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. 

నంద్యాల పార్లమెంట్ స్థానానికి అత్యధికంగా 61, అత్యల్పంగా చిత్తూరు పార్లమెంట్ స్థానానికి 13 నామినేషన్లు దాఖలైనట్టు ఆయన తెలిపారు సివిజిల్ యాప్ ద్వారా 20614 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు. 

ఇవాళ రాత్రికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తికానుందన్నారు.  కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు బుధవారం నాడు ఉదయానికి పూర్తి కానుందని ఆయన ప్రకటించారు.ఐటీ గ్రిడ్ విషయంలో ఏపీ, తెలంగాణ సిట్‌కు సహకరిస్తామన్నారు.