అమరావతి: రాజకీయ సన్యాసం చేయడంతో పాటు ఎన్నికల సర్వేలకు కూడ గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఇక భవిష్యత్‌లో ఎన్నికల సర్వేలు నిర్వహించబోనని ఆయన ప్రకటించారు.

ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమైనందుకు గాను సర్వేలు చేయబోనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు లగడపాటి రాజగోపాల్  శుక్రవారం నాడు ప్రకటనను విడుదల చేశారు.

తాను నిర్వహించిన సర్వేలతో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఫలితాలకు ఒక్క రోజు ముందుగా ఏపీ రాష్ట్రంలో టీడీపీకి 100 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. వైసీపీ కేవలం 70 స్థానాలకే పరిమితం కానుందని సర్వే ఫలితాలను విడుదల చేశారు.

గత ఏడాది డిసెంబర్ 7 వ తేదీన జరగిన తెలంగాణ అసెంబ్లీ సమయంలో కూడ ప్రజా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని లగడపాటి ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు. కానీ, లగడపాటి సర్వే ఫలితాలకు భిన్నంగా  తెలంగాణలో టీఆర్ఎస్ 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

తెలంగాణ అసెంబ్లీ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీ స్థానాల్లో కూడ లగడపాటి సర్వే అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సర్వే అంచనాలకు అందనంత దూరంలో ఫలితాలు వచ్చాయి. దీంతో ఇక భవిష్యత్తులో ఎన్నికల సర్వేలు నిర్వహించబోనని లగడపాటి  రాజగోపాల్ ప్రకటించారు.

2014  లో రాష్ట్ర విభజన  బిల్లు పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగే సమయంలో పెప్పర్ స్ప్రే కొట్టి లగడపాటి రాజగోపాల్ సంచలనానికి కారణమయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.2019 ఎన్నికల్లో నర్సరావుపేట నుండి లగడపాటి రాజగోపాల్ టీడీపీ నుండి  పోటీ చేస్తారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.

మరో వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ సర్వే ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో  సర్వే సన్యాసం చేస్తానని  లగడపాటి ప్రకటించారు.