పి.గన్నవరం: 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. అప్పుడు గెలిచా ఇప్పుడూ గెలుస్తా అంటూ ధీమాతో ఉన్నారు పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పాముల రాజేశ్వరిదేవి. 

2004లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రాజేశ్వరిదేవి కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో నగరం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2009లో కూడా త్రిముఖ పోటీలో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి గెలుపొందారు. 

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన పి.గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా, అందులోనూ మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. 

ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు నియోజకవర్గంలో మంచి పట్టుంది.  రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతోపాటు దళిత, కాపు సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఉండటంతో ఆమె గెలుపు తథ్యమంటూ చెప్పుకొస్తున్నారు. 

ఎస్సీ రిజర్వు అయిన పి.గన్నవరం నియోజకవర్గంలో 70వేలకు మందిపైగా దళిత ఓటర్లు ఉండగా 50 వేలకుపైగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. బీసీ ఇతర సామాజికవర్గాలు 50వేలు ఉన్నారు. 

ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కొండేటి చిట్టిబాబు బరిలో ఉండగా, టీడీపీ అభ్యర్థిగా స్టాలిన్ బాబు పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమతోపాటు ఇతరులు కూడా పోటీలో ఉన్నారు.   

దళిత, బీసీ, ఇతర సామాజిక వర్గాల్లో పాముల రాజేశ్వరి దేవికి మంచి పట్టుండటంతో ఆమె గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది జనసేన పార్టీ. జనసేన పార్టీ లెఫ్ట్ పార్టీలతోపాటు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో దళిత సామాజిక వర్గం ఓట్లు లెఫ్ట్ పార్టీల ఓట్లు పడే అవకాశం ఉందని జనసేన భావిస్తోంది. 

అలాగే టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు తొలిసారిగా పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈమెకు కాస్త కలిసొచ్చే అంశం. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నేపథ్యంలో ఆయన క్యాడర్ కొంతమంది వైసీపీలోకి జనసేనలోకి జంప్ అయ్యారు. ఈ పరిణామాలు పాముల రాజేశ్వరి దేవికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. అలాగే కుల సమీకరణాల ప్రకారం దళిత ఓట్లను నలుగురు కీలక నేతలు పంచుకోబోతున్నారు. 

టీడీపీకి బీసీ సామాజిక వర్గంలో అత్యధిక శాతం, ఎస్సీలో కొన్ని సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. వైసీపీ కూడా అదే తరహాలో బీసీ, దళిత ఓట్లను చీల్చే అవకాశం ఉంది. 

ఇకపోతే బీజేపీ తరపున పోటీ చేసే మానేపల్లి అయ్యాజీ వేమ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దళితులలో ఈయనకు మంచి పేరుంది. దళిత ఓటు బ్యాంకులో అత్యధిక శాతం అయ్యాజీ వేమ పట్టుకుపోయే అవకాశం లేకపోలేదు. 

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ, బీజేపీలు దళిత, బీసీ సామాజిక వర్గాల ఓట్లు చీల్చినా కాపు సామాజిక వర్గం ఓట్లు మాత్రం గంపగుత్తగా జనసేనకు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్ని సామాజిక వర్గాల్లో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న పాములు రాజేశ్వరి దేవి బీసీ, దళిత ఓట్లను కూడా భారీగానే చీల్చే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె గెలుపుపై ధీమాగా ఉంది జనసేన పార్టీ. 

 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున జంగా గౌతమ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పాముల రాజేశ్వరిదేవి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. జంగా గౌతమ్ కేవలం 3600 ఓట్ల తేడాతో మాత్రమే పరాజయం పాలయ్యారు. 

జంగా గౌతమ్ కొత్త అభ్యర్థి కావడంతో పరిచయాలు తక్కువ కావడంతో ఆయన ఓటమి చెందారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ పరిణామాలనే బేరీజు వేసుకున్న పాముల రాజేశ్వరి దేవి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతోపాటు, అన్ని వర్గాల వారి అండదండలు ఉండటంతో ఆమె గెలుపుపై ధీమాగా ఉంది.  

ఇకపోతే పాముల రాజేశ్వరి దేవి రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి రానంతగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో జనసేన పార్టీ శిబిరం మాంచి ఊపులో ఉంది.
   
ఇకపోతే వైసీపీ తరుపున కొండేటి చిట్టిబాబు బరిలో దిగనున్నారు. కొండేటి చిట్టిబాబు సైతం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు ఓటర్లలో సానుభూతి ఉంది. కొండేటి చిట్టిబాబు ఇప్పటికే నియోజకవర్గాన్ని పలు దఫాలుగా చుట్టేశారు. ఆయన కూడా నువ్వా నేనా అన్న రీతిలో టఫ్ ఫైట్ ఇస్తున్నారు.