హిందూపురం: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరోసారి చిందులు తొక్కారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణ ఓ మీడియా ప్రతినిధిపై చిందులేశారు. 

ప్రాణాలు తీస్తా అంటూ ఒంటికాలిపై లేచారు. ఇష్టం వచ్చినట్లు బూతుపురాణం చదివారు. అంతేకాదు మీడియా ప్రతినిధిపై చెయ్యి కూడా చేసుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

అయితే బాలకృష్ణకు ఎదురుగా చిన్నపిల్లలు వస్తుండటంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది వారిని పక్కకు లాగిపడేశారు. ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధి షూట్ చేశారు. ఆ విషయాన్ని గమనించిన బాలకృష్ణ ఆ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. 

కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. ఆగ్రహంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను, ప్రాణాలు తీస్తాను. 

బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరింపులకు పాల్పడ్డారు. జనం పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో బాలకృష్ణ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి అక్కడ నుంచి ఉడాయించారు. 

బాలకృష్ణ మీడియా ప్రతినిధిపై చెయ్యిచేసుకోవడంతో జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. సభ్య సమాజం తలదించుకొనేలా ప్రవర్తించిన తీరును ప్రతిపక్ష పార్టీలు గర్హించాయి. 

ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఎన్నికల సంఘం బాలకృష్ణ మానసిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, నిస్పృహతో బాలకృష్ణ ఇలా ప్రవర్తిస్తున్నారని ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు.