ఎన్నికల వేళ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులపై హీరో శివాజీ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీ-విజిల్ అనే యాప్ రాష్ట్ర ఎన్నికల సంఘం కంట్రోల్‌లో లేదని అది కేంద్ర ఎన్నికల సంఘం కంట్రోల్‌లో ఉందని తెలిపారు.

సీ-విజిల్ ద్వారా ఎవరిపై అనుమానం ఉన్నా వారి ఇంటిపై సోదాలు జరపాల్సిందిగా ఫిర్యాదు చేయవచ్చని శివాజీ పేర్కొన్నారు. ఈ తరహా దాడులు కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరుగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు సరిగ్గా జరకకూడదని ఢిల్లీ స్థాయిలో ఆదేశాలతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని శివాజీ ఆరోపించారు. సినీ పరిశ్రమకు చెందిన వారు వివిధ రాజకీయ పార్టీల్లో చేరుతున్నారని వారిలో ఒక్కరు కూడా ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.

రాజకీయ పార్టీల్లోకి వచ్చి ఏం సాధిస్తారని శివాజీ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏపీలో పోటీ చేయాలనుకుంటే పోటీ చేయొచ్చని లేదంటే ఎవరికైనా మద్ధతు తెలపాలంటే తెలపవచ్చన్నారు. కానీ కుట్రలు చేయొద్దని కేసీఆర్‌కు శివాజీ విజ్ఞప్తి చేశారు.