హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సినీనటుడు రాజశేఖర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ అనిపించుకున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయి సూపర్ డూపర్ అనిపించారని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ లో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆయనలో చాలా మార్పు కనిపిస్తోందన్నారు. హైటెక్ సిటీకి పునాది వేసి చంద్రబాబు మంచి పేరు తెచ్చుకుంటే వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరింత మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. 

అలాంటి వ్యక్తి తనయుడు వైఎస్ జగన్ అని ఆయన ఓ పులిబిడ్డ అంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎంతో అద్భుతమైన పథకాలని కొనియాడారు. 

చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేర్లు మార్చి పెట్టారని చెప్పుకొచ్చారు. సరికొత్తగా పింఛన్లు పెంచారని, నిరుద్యోగ భృతి అంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప పాలన అందిస్తారని నమ్మకం తమకు ఉందన్నారు. 

ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులకు, చీరలకు ఆశ పడొద్దని రాజశేఖర్ సూచించారు. ఏపీ ప్రజల భవిష్యత్‌ బాగుండాలంటే జగన్‌ను బలపరచాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని సూచించారు. తాము పార్టీలు పదేపదే మారడం లేదని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. 

ప్రజలు ఆదరిస్తున్న పార్టీలో చేరి వారికి తమవంతు సేవలందించాలన్నదే తన లక్ష్యమన్నారు రాజశేఖర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అవసరమైతే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్ ను సీఎం చెయ్యాలని కోరారు జీవిత రాజశేఖర్ దంపతులు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ తో విభేదాలు నిజమే, గతంలో చిరుతో కూడా: జీవిత రాజశేఖర్

వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల దంపతులు

వైసీపీలో చేరిన సినీనటుడు రాజశేఖర్, జీవిత