తణుకు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు హీరో రాజశేకర్. వేల కోట్లు సంపాదన వదిలేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అయితే వేల కోట్లు సంపాదన వదిలేసింది కేవలం చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమేనని ఆరోపించారు. 

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని లయన్స్ క్లబ్ లో ముస్లింల ఆత్మీయ సమావేశంలోపాల్గొన్న జీవిత, రాజశేఖర్ లు వైఎస్ జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. 

ఆరోగ్య శ్రీ, 108 లాంటి పథకాలతో ఎంతో మందికి ప్రాణదాత అయ్యారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ కంటే మంచి పథకాలను వైఎస్ జగన్ అమలు చేస్తారని చెప్పుకొచ్చారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. 

చంద్రబాబు నాయుడికి అనుభవం ఉందని సీఎం చేసి అంతా మోసపోయారని తెలిపారు. అమరావతి పేరుతో ముప్పైవేల ఎకరాల పంట భూములను నాశనం చేశారని రాజశేఖర్ ఆరోపించారు. అమరావతిని సింగపూర్‌ చేస్తానని భ్రమపెట్టారని, అక్కడి కంపెనీల దగ్గర కమీషన్లు కొట్టేశారని విమర్శించారు. 

ప్రజల కోసం బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్‌ జగన్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. మన భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయ్యాలని అభ్యర్థించారు. పసుపు-కుంకుమ డబ్బులతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన్ను నమ్మెుద్దని కోరారు జీవిత రాజశేఖర్.