విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీనటులు, వైసీపీనేత జీవిత రాజశేఖర్ లు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు సీఎం కావాలనే కోరిక బలంగా ఉందని ఆరోపించారు. 

విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ ఓటు అనే ఆయుధంతో ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత రైతులు, పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. 

ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ప్రాణదాతగా మారారని గుర్తు చేశారు. ఎన్నికష్టాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ లా సినిమాలు చేస్తూ..రాజకీయాలు మాట్లాడటం వైఎస్‌ జగన్ కు చేతకాదన్నారు. 

ఎన్ని కష్టాలు వచ్చినా జనంతోనే ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారని పవన్ లా కాదన్నారు.స్థిరమైన వైఖరి లేని పవన్‌ ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని ప్రశ్నించారు. 

బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమే పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్‌ కంపెనీలకు ఏజెంట్‌గా మారారని రాజశేఖర్‌ ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం వైఎస్ జగన్ వల్లే సాధ్యమని సినీనటి జీవిత అభిప్రాయపడ్డారు. 

గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోడమే మానేశారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చేసరికి పసుపు-కుంకుమ పేరుతో ఓట్లకు గాలం వెయ్యాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. 

కాల్‌మనీ పేరుతో ఎందరో మహిళలపై టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. చివరికి నందమూరి లక్ష్మీపార్వతి గురించి చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు గమనించాలని సినీనటి జీవిత కోరారు.