అన్ని రంగాల్లో ఉన్నట్టే రాజకీయాల్లోనూ వారసత్వం ఉంటుంది. దేశంలో ఏ పార్టీ తీసుకున్నా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని స్థాయిల్లోని రాజకీయాల్లో వారసత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వారసత్వం తెరపైకి వచ్చింది.

ఈసారి చాలా మంది సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం కల్పించారు. ఇక రాజకీయాలకు రాజధాని లాంటి కృష్ణాజిల్లా విషయానికొస్తే ఈసారి బరిలో నిలిచిన వారిలో మెజారిటీ వారసులే.

అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు. మంత్రిగా, ఏపీ శానససభ డిప్యూటీ స్పీకర్‌గా ఆయన వ్యవహరించారు. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ఈసారి మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

తన సోదరుడు, మాజీ దేవినేని వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించడంతో దేవినేని ఉమా మహేశ్వరరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. నందిగామ నుంచి తొలుత ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత తన వేదికను మైలవరానికి మార్చుకున్నారు.

నందిగామ నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగిన తంగిరాల సౌమ్య.. తన తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. నందిగామలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె గెలుపొందారు

బెజవాడ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దివంగత వంగవీటి మోహనరంగా రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు రాధాకృష్ణ కొనసాగిస్తున్నారు. 1985లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ విజయం సాధించారు.

1988లో ఆయన హత్యకు గురికావడంతో రంగా భార్య రత్నకుమారి 1989, 94లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రంగా కుమారుడు రాధాకృష్ణ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలో పనిచేసి కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీ సీనియర్ నేత దివంగత దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా దేవినేని అవినాశ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో కాంగ్రెస్ తరపున విజయవాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన అవినాశ్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఆ తర్వాత దేవినేని నెహ్రూ, కుమారుడితో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించారు. తాజా ఎన్నికల్లో అవినాశ్‌ను గుడివాడ నుంచి చంద్రబాబు బరిలోకి దింపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కోనేరు రంగారావు రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమార్తె తాంతియా కుమారి అందిపుచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెనమలూరు నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. 

టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు వారసుడిగా ఆయన తనయుడు వెంకట కృష్ణప్రసాద్ ఈసారి పెడన నుంచి పోటీ చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో వెంకట్రావు పోటీ నుంచి తప్పుకోవడంతో తనకు బదులుగా కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానానికి తెలిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు వెంకట కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు అవకాశం కల్పించారు. 

విజయవాడ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వయసు కారణంగా జలీల్ ఖాన్ పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తె షబానాకు టికెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికలకు ముందే ఆమె అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయడంతో షబానా అందరికంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.