మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారా..? గత కొంత కాలంగా అవుననే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. కాగా... దీనిపై తాజాగా గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ విషయంపై ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.

తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రజల నమ్మకమే తనను గెలిపించిందని గంటా అన్నారు. తాను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే కృషి చేస్తామని చెప్పారు. ఇంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడానికి గల కారణాలను ఈనెల 29న జరగనున్న పార్టీ సమావేశంలో విశ్లేషించుకుంటామన్నారు. పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపి 2024లో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. 

తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్లలన్నీ ఉట్టి పుకార్లేనని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌కు, శాసనసభ్యులకు ఈ సందర్భంగా గంటా అభినందలు తెలిపారు.