ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందా అని సర్వత్రా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఒక వైపు చంద్రబాబు... మరోవైపు జగన్ లు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎవరికి వాళ్లు.. తమదే గెలుపు అని చెప్పుకుంటున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహుర్తాలు కూడా చూసుకుంటున్నారు. పార్టీ అధినేతల్లో ఈ ధీమా... పార్టీ నేతల్లో మాత్రం కనపడటం లేదు.. అందుకే.. అందరూ టెన్షన్ గానే రిసల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.., ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ గెలపు ఓటములపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్నికల బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10.15లక్షలు, కారు, 7 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తమకు సమాచారం రావడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ పోలీసులు తెలిపారు.

ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ పోటీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోమ గెలుపు... టీడీపీ ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా ఉంది. అందుకే బరిలోకి లోకేష్ ని దింపి గెలుపుకోసం ప్రయత్నించింది. ఇక ప్రత్యర్థి పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణ బరిలో ఉన్నారు. ఆయనకు ఆ ప్రాంతంలో మద్దతు ఎక్కువ. ఈ క్రమంలో విజయం ఎవరికి దక్కుతుందా అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగులు లక్షల్లో కాస్తూ... ఇలా పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.