కడప: పార్టీలో తన పరిస్థితి తనకు కన్నీళ్లు తెప్పించిందని మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ అన్నారు. తనను పార్టీలోకి రావాలని అమరావతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారని, ఆ తర్వాత ఘోరంగా అవమానించారని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సాయి ప్రతాప్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల తాను మనోవేదనకు గురైనట్లు ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి తాను టీడిపిలో చేరానని, కానీ సమస్యలేవీ పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. 

కడప జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాజంపేట లోకసభ స్థానానికి ఆయన ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆయన సహాయ మంత్రిగా ఉక్కు శాఖను నిర్వహించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసి 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు.