అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య బంధంపై సినీనటి మాజీఎమ్మెల్యే జయసుధ  కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే నడుస్తున్నారంటూ ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని అంతా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

పవన్ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబును అనుసరిస్తుంటారని అందుకే చంద్రబాబులా  జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. 

రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే తాను వైసీపీలో చేరానని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని వెనకడుగు మాత్రం వెయ్యలేదని, నమ్మకం కోల్పోలేదని స్పష్టం చేశారు. 

వైఎస్ఆర్ లా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు. అనంతరం నందిగామ వైసీపీ అభ్యర్థి మెండితోక జగన్ మోహన్ రావుకు మద్దతుగా సినీనటుడు రాజారవీంద్రతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

వైఎస్‌ జగన్‌ మాటమీద నిలబడే వ్యక్తి అని ఆయన ఇచ్చిన హామీలను అమలు చేస్తారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలు అద్భుతమైన పథకాలంటూ చెప్పుకొచ్చారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. 

పదేళ్లుగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజల మధ్యే ఉంటున్న జగన్ చంద్రబాబు కంటే ఎక్కువ అనుభవం గడించారని స్పష్టం చేశారు. జగన్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయమని ఆమె పిలుపునిచ్చారు. 

సినీ పరిశ్రమకు వైఎస్సార్‌ ఎంతో మేలు చేశారని, అందుకే ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ అంటే సినీ పరిశ్రమలో ఉన్న వారందరికి అభిమానమన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు అండగా సినీ పరిశ్రమలో ఉన్న 80 శాతం మంది అండగా నిలిచారని జయసుధ స్పష్టం చేశారు.