అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీపై గుర్రుగా ఉన్న దీపక్ రెడ్డిని బుజ్జగించి ఒక సమస్య తీర్చానని చెప్పుకుంటున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు. 

దీంతో జేసీ కోటకు బీటలు వాలినట్లైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన గుత్తా వెంకటనాయుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరిపోయారు. గత 35 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నా సరైన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. 

ఆయనతోపాటు టీడీపీ ముఖ్యనేత కాకర్ల రంగనాథ్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృష్టి చేస్తానని వెంకటనాయుడు స్పష్టం చేశారు. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా  జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో గుత్తా వెంకటనాయుడు పార్టీ వీడటం కాస్త ఇబ్బంది అని చెప్పుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. నువ్వా నేనా అన్న తరహాలో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.