పామర్రు: కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బతగిలింది. పామర్రు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే డీవై దాసు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టికెట్‌ ఇస్తామని పార్టీలో చేర్చుకుని తనను ఘోరంగా అవమానించారని డీవైదాస్ ఆరోపించారు. 

పవన్ కళ్యాణ్ తీరుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆహ్వానం మేరకు మార్చి 18న జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు. టికెట్‌ ఇస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలను సమీకరించి నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టానన్నారు. 

తీరా లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో మనోహర్‌కు ఫోన్‌ చేస్తే మీ పేరు లిస్ట్‌లో ప్రచురించలేదని చెప్పారని స్పష్టం చేశారు. జనసేన కార్యాలయం నుంచి పులిశేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని కోరారని తెలిపారు. 

తన ప్రతినిధిని పంపిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీఎస్పీ ఎంపీ వీర్ సింగ్ ను కలిస్తే తనకు న్యాయం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారని అయినా మనసు చంపుకుని తీరా అక్కడికి వెళ్తే బీఎస్పీ టికెట్ బీఫారంఇస్తామన్నారని ఆరోపించారు. 

తాను జనసేనలో చేరితే బీఎస్పీ టికెట్‌ అంటారు ఏంటా అని షాక్‌ తిన్నానని డీవై దాస్ తెలిపారు. మోసం చేసిన జనసేనకు తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభి లాషుల తో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. డీవై దాస్ వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.