తొలి జాబితా విడుదల తర్వాత.. టీడీపీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.  గురువారం విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో.. మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్న పీతల సుజాతకు ఇప్పటి వరకు టికెట్ కన్ఫామ్ కాలేదు. రెండో జాబితాలోనూ చోటు దక్కే అవకాశం కనపడట్లేదు.

వచ్చే ఎన్నికల్లో చింతలపూడి టికెట్ ను కర్రా రాజారావుకు కేటాయించారు. అయితే.. మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆ సీటైనా తనకు కేటాయిస్తారని పీతల సుజతా భావించారు. అయితే.. ఆ సీటును అనితకు కేటాయించారు. దీంతో.. పీతలకు మొండి చెయ్యి మిగిలింది.

కాగా, టీడీపీ తొలి జాబితాలో జిల్లాలో ఉన్న 11 స్థానాల్లో 9 మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. సుజాతకు టికెట్‌ కేటాయించే విషయంలో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు వర్గం వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. వ్యతిరేక వర్గం ఒత్తిడితోనే సుజాతకు టికెట్‌ దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్‌ కేటాయించిన చంద్రబాబు తనకు మాత్రం  అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.