పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో... చంద్రబాబు చేసే ప్రలోభాలకు లొంగిపోకుండా ఏపీ ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.

ఆదివారం ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రజలు చంద్రబాబును ఓటర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు.

అధికారం కోసం చివరి నిమిషంలో ఆయన ఎన్ని ఆరాచకాలకయినా పాల్పడతారని హెచ్చరించారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టిన దళిత వ్యతిరేకి చంద్రబాబే అన్నారు.

జగన్ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని మోత్కుపల్లి తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్‌కు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ మద్ధతు తెలిపింది. దేశంలోనే తొలిసారి ప్రైవేట్ టీచర్స్ అవసరాలు, సమస్యలను మేనిఫెస్టోలో పొందు పరిచి పరిష్కరించడానికి జగన్ ముందుకొచ్చారని వారు ప్రశంసించారు.

అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో పలువురు ఎన్ఆర్ఐలు జగన్‌ను కలిసి మద్ధతు ప్రకటించారు.