మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు. మొదట టీడీపీలో చేరాలని భావించి.. చంద్రబాబుతో సమావేశమైన ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రికి ట్విస్ట్ ఇచ్చారు.

రెండు రోజుల్లోనే తన అనుచరులతో కలిసి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. కొణతాల తప్పించి మిగిలిన వారంతా వైసీపీ కండువా కప్పుకున్నారు కానీ.. ఆయన మాత్రం అందుకు నిరాకరించారు.

తనపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే సరిపోతుందని కొణతాల.. జగన్‌కు సూచించారు. ఆయన వైఖరిపై అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ అధిష్టానం కొణతాలకు సీటు కేటాయించలేదు.

ఈ క్రమంలో అనకాపల్లి రింగురోడ్డులోని తన కార్యాలయంలో అనుచరులతో రెండు రోజులుగా సమావేశమవుతున్నారు. గురువారం కశింకోట మండలానికి చెందిన సన్నిహితులతో విడిగా భేటీ అయిన ఆయనకు ఎక్కువ మంది టీడీపీలో చేరితేనే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం.

అయితే కొణతాల వర్గీయుడైన ఒక నాయకుడు మాత్రం స్థానిక టీడీపీ నేతలతో సర్దుకుపోలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఆయన అతి త్వరలో టీడీపీలో చేరుతారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు టీడీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు అక్కడికి వెళ్లినా టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో కొణతాల ఏ నిర్ణయం తీసుకుంటారోనని అభిమానులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.