అమరావతి: తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

తాను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరలేదన్నారు. ఒకవేళ చేరితే ప్రజలకు చెప్పే చేరుతానంటూ చెప్పుకొచ్చారు. తన రాజకీయ ప్రవేశంపై ముందు ప్రజలకే స్పష్టం చేస్తానని ఆ తర్వాతే పార్టీలో చేరడమా సొంత పార్టీపెట్టుకోవడమా అన్నది తెలియజేస్తానని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. 

అయితే బుధవారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

అటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణల మధ్య ముసుగు తొలగిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కు అడ్డంకులు సృష్టిద్దామనే జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. భీమిలి నుంచి బరిలోకి..?