హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో, నేతల మాటల తూటాలతో రాజకీయవేడి రోహిణి కార్తెను తలపిస్తోంది. 

అన్ని పార్టీలు స్టార్  కాంపైనర్లపై అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి దివ్యవాని, తారకరత్న, వైసీపీ నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్స్, జనసేన పార్టీకి గబ్బర్ సింగ్ టీం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. 

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరంజీవి తమ పార్టీ స్టార్ కాంపైనర్ అంటూ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటనతో మెగాస్టార్ చిరంజీవి ఇరకాటంలో పడ్డారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి తనసత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. 

అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీలోకి వస్తారని, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జనసేనవైపు చేరగా మరికొందరు వైసీపీలో చేరిపోయారు.  

ఇకపోతే రాజకీయంగా మంచి భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే రక్తసంబంధం ఇబ్బంది పడుతుందని, రక్తసంబంధానికి విలువ ఇచ్చి జనసేన తరపున ప్రచారం చేస్తే రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వాడినవుతానని చిరంజీవి భావిస్తున్నారట. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చెయ్యాలో తోచక తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు తన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రిపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ సీఎం ఆంధ్రా వ్యాపారులను బెదిరిస్తున్నారని, ఆంధ్రావాళ్లపై భౌతిక దాడులకు దిగుతున్నారని, తెలంగాణ ఏమైనా పాకిస్థానా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముడి తరపున ప్రచారం చేస్తే అతని ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్లు అవుతుందేమోనని చిరంజీవి ఆందోళనలో ఉన్నారట. 

తన పెద్ద తమ్ముడు నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీ చేస్తుండగా చిన్న తమ్ముడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల్లో ప్రచారం చేస్తే భారీ సంఖ్యలో ఓట్లు కొల్లగొట్టవచ్చిన జనసేన పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి డైలామాలో పడ్డారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తన పరిస్థితి తయారైందని అనూయుల వద్ద వాపోయారట. 

ఎవరికీ ప్రచారం చెయ్యకుండా ఉండాలన్న ఉద్దేశంతో చిరంజీవి రాష్ట్రాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. చాలా భారంగా తప్పనిసరి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని చిరంజీవి తన అనూయుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో చిరంజీవి విదేశాలకు వెళ్లనున్నారని సమాచారం.