ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉన్నతాధికారుల బదిలీ వ్యవహారం వివాదంగా మారింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈసీ తీరుతో అధికార తెలుగుదేశం పార్టీ గుర్రుగా ఉంది. వైసీపీ, బీజేపీ కుట్రలో భాగంగానే పోలీసు ఉన్నధికారులు బదిలీలు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బదిలీల నేపథ్యంలో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం రాత్రి ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. రానున్న రోజుల్లో మరికొందరు అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉందని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది.

గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోని ఎన్నికల సంఘం.. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులను ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ బదిలీపై న్యాయపోరాటం చేస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.