అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సంఘం (ఈసి) మరో షాక్ ఇచ్చింది. ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా తొలి ఝలక్ ఇచ్చిన ఈసీ ఈసారి నిరుద్యోగ భృతి పెంపును నిలిపేసింది. 

చంద్రబాబు నిరుద్యోగ భృతిని ఏకంగా వేయి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచడాన్ని ఈసి తప్పు పట్టింది. ఎన్నికలు ముగిసే వరకు ఆ పెంపును ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ ఆదేశాలు జారీ చేసింది. 

యువనేస్తం పథకాన్ని ఆరు నెలల క్రితం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా నిరుద్యోగులకు వేయి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని ప్రకటించారు. దాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకటించారు. అయితే, అది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈసీ ప్రకటించింది. 

రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల మూడో విడత ఎంపిక కోసం ఎపి ప్రభుత్వం కోరిన అనుమతిని ఈసి మన్నించింది. ఎపిఐసిలో ఇద్దరు సమాచార శాఖ కమిషనర్ల నియామకానికి కూడా పచ్చజెండా ఊపింది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది కాబట్టి వాటికి రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర అవసరం.