హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. 

పార్టీ కండువాకప్పి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఏపీ ప్రజలు వైఎస్‌ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. 

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోయిందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలో అనే అంశం పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. 

వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖసౌత్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపారు. టికెట్ పై వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.