హైదరాబాద్:విశాఖ జిల్లా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమె స్థానంలో  కేజీహెచ్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న బంగారయ్యకు టిక్కెట్టు కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

విశాఖ జిల్లా పాయకరావుపేట నుండగి 2014 ఎన్నికల్లో అనిత టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అనితపై స్థానిక టీడీపీ కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అనితకు బదులుగా మరోకరికి టిక్కెట్టు ఇవ్వాలని స్థానిక  టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. దీంతో పాయకరావుపేటలో పలు అభ్యర్ధిత్వాలను చంద్రబాబునాయుడు పరిశీలించారు.

దరిమిలా విశాఖలోని కేజీహెచ్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ బంగారయ్య పేరును ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. బంగారయ్యను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గంటా శ్రీనివాసరావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే విశాఖ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని చంద్రబాబు ఆయనను కోరారు. కానీ ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

గంటా శ్రీనివాసరావు నిర్ణయాన్ని బట్టి అనకాపల్లి, చోడవరం అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉందని  టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మరో వైపు యలమంచిలి నుండి పంచకర్ల రమేష్ బాబు పోటీకి వెనుకడుగు వేస్తున్నారు. విశాఖ నార్త్ నుండి పంచకర్ల రమేష్‌బాబు పోటీకి ఆసక్తిగా ఉన్నారు.