లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకొని.. మరోసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ సినిమా విడుదలను ఏపీలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లో సినిమా విడుదలయ్యింది. మూవీకి రెస్పాన్స్ కూడా పాజిటివ్ గా వస్తోంది.

కాగా.. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఓ సినిమాను అడ్డుకోవడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఒక పౌరుడిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తూనే.. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి ఈ విషయమై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఒక రాష్ట్రంలో సినిమా విడుదలై మరో రాష్ట్రంలో నిలిచిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. 

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను అడ్డుకోవడం ద్వారా ఎన్టీఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎన్టీఆర్‌కు న్యాయం చేస్తామని..ఏపీలో సినిమా విడుదలకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో అక్కడా కూడా సినిమా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎన్టీఆర్‌కు న్యాయం చేస్తామని ప్రమాణం చేసి చెప్తున్నా’ అన్నారు.

సినిమా విడుదలను ఎవరు అడ్డుకున్నారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. కాకపోతే ఈ కేసుకు ప్రస్తుతం హైకోర్టులో ఉందని అందుకే తాను ఆ వ్యక్తి పేరు బయటకు చెప్పడం లేదని.. ధైర్యం లేక కాదు అని అన్నారు.