విశాఖపట్నం: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఘన విజయం సాధించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి, మంత్రి అయ్యన్నపాత్రుడుపై 22,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

2014 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి అయ్యన్నపాత్రుడుపై పోటీ చేసిన ఉమా శంకర్ గణేష్ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ లో ఈసారి భారీ విజయాన్ని అందుకున్నారు. 

ఈసారి ఎన్నికల్లో మంత్రి అయ్యన్నపాత్రుడుకు 67,777 ఓట్లు రాగా ఉమాశంకరక్ గణేష్ కు 90,077 ఓట్లు వచ్చాయి. దీంతో ఉమాశంకర్ గణేష్ కు 22,300 మెజారిటీ దక్కింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండటంతో పాటు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడును ఓడించడంపై నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇకపోతే ఉమాశంకర్ గణేష్ మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని నియోజకవర్గంలో ప్రచారం కూడా ఉండేది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటున్న సమయంలో ఆయన 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. 

అయితే ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పక్కా వ్యూహంతో ఎన్నికలకు వెళ్లిన ఉమాశంకర్ గణేష్ భారీ విజయం అందుకున్నారు. 

మంత్రి అయ్యన్నపాత్రుడుపై నియోజకవర్గంలో చెలరేగిన అసమ్మతి, కుటుంబంలో విభేదాలు, ఆధిపత్యపోరు ఆయన ఓటమికి కారణాలు అయితే అవే అంశాలు గణేష్ విజయానికి దోహదపడ్డాయి. ఇకపోతే అయ్యన్నపాత్రుడుకు రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ కూడా ఉంది. 

ఆయన పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనంతరం ఓటమి పాలవుతారు. అంటే ప్రతీ పదేళ్లకు ఓడిపోవడం ఆనవాయితీగా వస్తుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. 1989లో గెలిచిన అయ్యన్నపాత్రుడు 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 

2009లో గెలిచిన అనంతరం 2019 ఎన్నికల్లో పరాజయం పొందారు. మెుత్తానికి ఉమాశంకర్ గణేష్ గెలుపు రికార్డేనని చెప్పుకోవాలి. గురువును ఓడించిన శిష్యుడిగా, మంత్రిని మట్టికరిపించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.