పోలవరం పనులు చాలా వేగవంతంగా నడుస్తున్నాయని... దీని కోసమే సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. బుధవారం ఉదయం దేవినేని మీడియాతో మాట్లాడారు.

70 శాతానికి పైగా పోలవరం  పనులు పూర్తయ్యాయని దేవినేని చెప్పారు.  అప్పర్ కాపర్, లోయర్ కాపర్ డ్యాం నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.  సుమారు 500 మంది ఇంజినీర్లు డ్యాం సైట్లో పనిచేస్తున్నారని చెప్పారు.  కొన్ని వందల మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారని.. నిపుణులు, ఇంజినీర్లు సమక్షంలో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. 
 
పోలవరం పూర్తైతే  భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం జగన్ నోరు విప్పరని ఎద్దేవా చేశారు.  వైఎస్ హయాంలో లబ్ధి పొందిన వారంతా అక్కడ టీఆర్‌ఎస్‌లో.. ఇక్కడ వైసీపీలో చేరారని చెప్పుకొచ్చారు.  ప్రమాణ స్వీకారం చేయాలంటే 7 ముంపు మండలాలు మన రాష్ట్రంలో కలపాలన్నారని గుర్తు చేవారు.

 దేవాలయాలు మునిగిపోతాయని చేబుతున్న కేసీఆర్ ఆనాడు ఏంచేశారు అని ప్రశ్నించారు.  ఏదో రకంగా పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.  కేసీఆర్, కవిత పోలవరానికి వ్యతిరేకంగా పిటిషన్‌లు వేసినప్పుడు కేవీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

 కొంతమంది రాజమండ్రి కొట్టుకు పోతుందని అసత్యాలు చెబుతున్నారని దేవినేని మండిపడ్డారు.  వైసీపీపై ప్రేమ ఉంటే పార్టీలో చేరండి కానీ ఇలా ప్రజలను పక్కదారి పట్టించొద్దని కొందరు నేతలకు దేవినేని హితవు పలికారు.  ఒక్కసారి కూడా డ్యాం చూడకుండానే సాక్షిలో అసత్యాలు, అవస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
జగన్ కు లబ్ధి చేకూర్చడానికి కేవీపీ శతవిధాలా ప్రయత్నించారని ఆరోపించారు.  పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నించారన్నారు.  ఆ దుర్బుద్ధి కారణంగా పోలవరం పనులు రెండేళ్లకు పైగా ఆగిపోయాయని గుర్తు చేశారు.  జగన్ కనుసన్నల్లో ఇక్కడ రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

జగన్‌కి పట్టిన శని విజయసాయి రెడ్డి అని అన్నారు. ఈ నెల  23న వచ్చే ఫలితాలతో వైసీపీ దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు. 
 పోలవరానికి రావలసిన నిధులను రేపు కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి సాధించుకుంటామన్నారు.  జాతీయ ప్రాజెక్టును ఒక్కసారైనా ప్రధాని, ప్రతిపక్ష నేత, విజయసాయిరెడ్డి వచ్చి చూసారా?  అని ప్రశ్నించారు.

కేసీఆర్, జగన్ దర్శకత్వంలో అందరూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.  పోలవరానికి సంబంధించి ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ప్రాజెక్టు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు.  ప్రాణాలకు తెగించి కార్మికులు పనులు చేస్తుంటే రాళ్లేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పోలవరంపై విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోవాలని దేవినేని కోరారు.