ఎన్నికల సంఘం వ్యవహారశైలి ఏం బాగోలేదన్నారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో బుధవారం మీట్‌ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన చట్టాన్ని 2014 ఆర్ధిక సంఘం ప్రస్తావించలేదని కారణం చూపి ప్రధాని అమలు చేయడం లేదని, బీజేపీ రాష్ట్రం పట్ల దారుణమైన వివిక్ష చూపిందని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం మొట్టమొదటిసారి రాష్ట్ర బంద్ నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

విద్యా, వైద్య రంగాలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ అజెండా అని రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులకు, కార్పోరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు.

లంచగొండితనం, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయని నెల్లూరు రవాణా శాఖ అటెండర్, విజయవాడలో రెవెన్యూ అధికారుల వద్ద వందల కోట్ల నల్లధనం బయటపడిందన్నారు.

23 మంది ఎమ్మెల్యేలు, నలుగురు పార్లమెంట్ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించి చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించారని.. రాజకీయాలలో నైతికత, నిబద్ధత ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు.

తాజా ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నట్లుగా ఉంది... అభ్యర్థుల ఖర్చుపై ఏమాత్రం నిఘా లేదని ఆయన విమర్శించారు. వేల కోట్ల ధనప్రవాహాన్ని మీరు ఎలా అడ్డుకున్నారు... ఎవరిపై చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయగలరా అని రామకృష్ణ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి అందరూ ముందుకు రావాలని, కొత్త రాజకీయాలకు నాంది పలకాలని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు రావాలని కోరుతున్నానన్నారు.