హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏమైనా పాకిస్థానా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.  తెలంగాణలో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతో ఎదిగిన మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇన్నేళ్లలో తన కులం ఏంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం రాలేదన్న చిన్ని కృష్ణ తాను కూడా కాపు కులస్థుడునేనని చెప్పుకొచ్చారు. కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ఒక్కటే రిప్రజెంటేషన్‌ కాదన్నారు. కాపులు అంటే వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అని చెప్పుకొచ్చారు. 

మెగాస్టార్‌ చిరంజీవికి ఆల్‌ టైం హిట్ సినిమా ఇంద్ర లాంటి కథ ఇస్తే ఏ రోజు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ ను హీరోగా పరిచయం చేసేందుకు గంగోత్రి కథ కోసం ఎన్నో అవకాశలు వదులుకున్నానని గుర్తు చేశారు. 

పవన్‌ కల్యాణ్‌కు సినిమాల పట్ల ఫోకస్‌ లేదన్న ఆయన ఇండస్ట్రీలో తెలుగు వారిని అతి తక్కువ గౌరవించే వ్యక్తి పవన్‌ అని విమర్శించారు. మరోవైపు కేసీఆర్‌ చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా అంటే నువ్వెందుకు ఉలికి పడుతున్నావ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని సెటిలర్స్‌ అంతా పవన్‌, బాబులకు వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

మీరు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇక్కడి వ్యవస్థ మమ్మల్ని పట్టించుకోకపోతే నువ్వొచ్చి కాపాడతావా అంటూ నిలదీశారు. లేక మీ అన్నలు నాగబాబు, చిరంజీవిలు వచ్చి కాపాడతారా అంటూ ప్రశ్నించారు. మా జీవితాలతో ఆడుకునే వ్యాఖ్యలు చేయోద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. 

కాపుల సొమ్ముతో ఎదిగిన మీ కుటుంబం వారికి తిరిగి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ రంగం నుంచి ఇంత పొందిన మెగా ఫ్యామిలీ సినీరంగం కోసం ఒక్క కార్యక్రమమైనా చేసిందా అని నిలదీశారు. అసలు నువ్వు సినీ రంగంలో ఎన్ని విజయాలు సాధించావ్‌ చెప్పు అంటూ పవన్‌ ను ప్రశ్నించారు. 

అజ్ఞాతవాసి ఓ విదేశి కథను కాఫీ కొట్టి తెరకెక్కించిన సినిమా కాదా అని ప్రశ్నించారు. దొంగతనం చేసిన కథతో సినిమా తెరకెక్కించి ఆ విషయంలో టీ సీరిస్‌కు పెనాల్టీ కట్టిన విషయం నిజం కాదా అని నిలదీశారు. 

రాజకీయం అంటే త్రివిక్రమ్‌ రాసిచ్చిన డైలాగులు చెప్పటం కాదు పవన్‌ అంటూ సెటైర్లు వేశారు. జగన్‌ సొంత పార్టీ పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతుంటే ఆయన మీద విమర్శలు చేస్తావా అంటూ నిలదీశారు. ప్రజా సంకల్పయాత్రతో రాష్ట్రమంతా తిరిగారని ఆయనకు ఓటు అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు. 

ఆయనకు తండ్రి లేరు, బాబాయిని చంపేశారు. ఆయనే చంపేశారని నిందలు వేస్తారా అంటూ  ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ లో కత్తితో దాడి చేస్తే జగన్ చేయించుకున్నారంటూ వ్యాఖ్యానిస్తారా అంటూ మండిపడ్డారు. రేపు ఆయన్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకునేలా వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా నీ రాజకీయం అంటూ నిలదీశారు. 

పవన్ రాజకీయం అంటే ఏంటో సీనియర్ల దగ్గరకు వెళ్లి నేర్చుకో అంటూ హితవు పలికారు. మే 23న రాబోయే రిజల్ట్ చూస్తే మీ గుండెలు బద్ధలైపోతాయని స్పష్టం చేశారు. ప్రజలు జగన్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆ విషయం తెలుసుకోవాలని స్పష్టం చేశారు చిన్ని కృష్ణ. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి సాక్షిగా అంత మంది చావుకు కారణమైతే నీకు కనిపించలేదా పవన్‌ అంటూ నిలదీశారు. బోయపాటి శ్రీనివాస్‌ అనే దర్శకుడిని తీసుకు వచ్చి వేల మంది మధ్య షూటింగ్‌ చేస్తూ ఆడపడుచుల ఉసురు తీసి ఇప్పుడు పసుపు కుంకుమ పంచుతున్నారు దానిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 

విజయవాడలో కేవలం 62 పిల్లర్ల ఫ్లైఓవర్‌ను ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనటం లేదంటే మీ మధ్య ఎలాంటి అవగాహన ఉందో తెలుస్తోందన్నారు. మెగా ఫ్యామిలీకి సూపర్‌ హిట్ కథలను అందించిన రచయిత చిన్ని కృష్ణ పవన్‌ కళ్యాణ్ పై ఇలా తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.